ఐదు దశాబ్దాల నుంచి వ్యవసాయ అనుబంధ రంగంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. అప్పటివరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఉన్న పాడి పరిశ్రమను పక్కకు నెట్టి.. పౌల్ట్రీ పరిశ్రమ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మొదట్లో వేల కోళ్లతో ప్రారంభమైన పరిశ్రమ అనతికాలంలోనే లక్షల్లోకి చేరింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో 2 కోట్లకు పైగా కోళ్లతో పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తోంది.
మిన్నంటిన దాణా ధరలు..
రెండేళ్లుగా పెరుగుతున్న దాణా ధరలు రైతులకు శాపంగా మారాయి. 2019లో మొక్కజొన్న, ఇతర ముడిసరుకుల ధరలు.. విపరీతంగా పెరగటంతో దాణా ధర టన్ను 24 వేల రూపాయలకు చేరింది. 2020లో కరోనా ప్రభావంతో ముడిసరుకుల ధరలు తగ్గిన కారణంగా.. దాణా ధర టన్ను 19 వేల రూపాయలకు దిగి వచ్చింది. ఈ మధ్య కాలంలో ధరలు పెరిగి టన్ను దాణా ధర 22 వేల రూపాయలకు చేరింది. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర కనీసం నాలుగు రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు 20 శాతం వంతున మొత్తం 40 శాతం అదనపు రుణాలు ఇవ్వటంతో పరిశ్రమను నిలుపుకోగలిగామన్నారు.