లాక్ డౌన్ కారణంగా 2 నెలలపాటు ఇసుక రవాణా ఆగిపోయింది. ఈ కాలంలో భవన నిర్మాణ కార్మికులు పస్తులతో జీవనం సాగించారు. తీరా ప్రభుత్వం సడలింపులు ఇచ్చి రవాణాకు అనుమతిచ్చే సమయానికి ఇసుక దొరక్కుండా పోయింది. గుత్తేదారులు, బడాబాబులు, దళారీలకే చిక్కుతున్న ఇసుక.. సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. కృత్రిమ కొరత వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని పలువురు అంటున్నారు.
దండుకుంటున్న దళారీలు
గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇసుక దొరకని పరిస్థితి వచ్చిందంటే.. ఏ రకంగా దళారీలు దండుకుంటున్నారో అర్థమవుతోంది. ఆన్ లైన్ విధానంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. ఇదే అదనుగా మార్కెట్లో ఉన్న గిరాకీని దళారీలు సొమ్ము చేసుకొంటున్నారు. ఎక్కువ మొత్తంలో ఇసుక బుక్ చేస్తూ.. నల్లబజారుకు తరలిస్తున్నారు. అధిక ధర పెట్టి అక్కడ ఇసుక కొనలేని సామాన్యులు నిర్మాణ పనులు నిలిపివేస్తున్నారు. ఈ ప్రభావం కార్మికుల పైన పడుతోంది.
కృత్రిమ కొరతే
జిల్లాలో ఇసుక కొరత వల్ల చాలావరకు ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయి. లాక్డౌన్ సడలించాక కొరత ఉండదని ఆశగా చూసిన జనాలకు... నిరాశే ఎదురవుతోంది. రీచ్ల వద్ద ఇసుక దొరకడం లేదు. కనీసం ఆన్లైన్లో బుక్ చేద్దామన్నా.. సైట్ తెరుచుకోవడం లేదు. కొద్దిసేపు తెరుచుకుంటున్నా.. ఆ సమయంలో దళారీలు, బడాబాబులు ఎక్కువ మొత్తం ఇసుకను బుక్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వారివల్లే కృత్రిమ కొరత వస్తోందని పలువురు వాపోతున్నారు.
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవు
జిల్లాలో ప్రక్కిలంక, తాళ్లపూడి, వేగేశ్వరపురం, యలమంచలిలంక, దొడ్డిపట్ల, కరుగోరుమిల్లి, అబ్బిరాజుపాలెం, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగబాద్, పదిరిబోలు ప్రాంతాల్లో ఇసుక రీచ్లు ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి తోడుతున్న ఇసుక నిమిషాల్లో అయిపోతోంది. నిల్వకేంద్రాల్లో సైతం ఉండటం లేదు. ఒక్కో రీచ్ నుంచి 300 టన్నుల ఇసుకను విక్రయిస్తున్నారు. ఇంతస్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నా.. ఇసుక ఎక్కడికెళుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి ఇసుక నాణ్యతగా ఉండటం వల్ల.. నగరాలకు ఎగుమతి చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో అధిక ధర వల్ల నిర్మాణాలు ఆగిపోయి.. తమకు ఉపాధి కరవైందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి తమ ఇక్కట్లు తొలగించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి... సబ్బులకు డిమాండ్ ఫుల్.. జీసీసీకి ఆదాయం భేష్