PPA Rejected Polavaram Project Bills: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో ప్రధాన డ్యాం పనుల్లో 314.79 కోట్లు, కుడి కాలువలో 190.28 కోట్లు, ఎడమ కాలువ పనుల్లో 329.08 కోట్లు, అధికారుల, ఉద్యోగుల జీతాల్లో 100.41 కోట్లు, భూసేకరణలో 49.55 కోట్లు ఇలా మరికొన్ని నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
ప్రాజెక్టు నిర్మాణానికే ఈ నిధులను వెచ్చించినందున ఆ మొత్తం ఇవ్వాలని ఏపీ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులను కోరారు. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక వెయ్యి 511.85 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇందులో 238.78 కోట్ల బిల్లులు ఇచ్చేందుకు పోలవరం అథారిటీ కేంద్రానికి సిఫారసు చేయగా, మరో 288.63 కోట్ల రూపాయలను భూసేకరణ, పునరావాసం చెల్లింపుల బిల్లులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (Polavaram Project Authority) పరిశీలనలో ఉన్నాయి. ఇవికాక ప్రస్తుతం 984.44 కోట్లు మాత్రం ఇచ్చేది లేదని తెలిపింది.
ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులు
ప్రధాన డ్యాంలో భాగంగా రాష్ట్ర అధికారులు సమర్పించిన 314.79 కోట్ల బిల్లులును అథారిటీ తిరస్కరించింది. ఇందులో విద్యుత్ కేంద్రం మట్టి తవ్వకాలకు 201.47 కోట్ల రూపాయలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. విద్యుత్ కేంద్రం ధరల పెంపునకు సంబంధించి 2022 ఫిబ్రవరి బిల్లుల నుంచి అదనపు మొత్తాలు 81.37 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేది లేదంది. ప్రధాన డ్యాంను కుడి, ఎడమ కాలువలతో అనుసంధానించే పనుల్లో అనుమతించిన పరిమితులను దాటి నిర్మాణాలు చేపట్టిన మొత్తాలు 8.59 కోట్లు సైతం ఇవ్వమని తెలిపింది. ఇవికాకుండా మరికొంత మొత్తమూ మినహాయించింది.