Pawan Kalyan fire on YSRCP: ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆస్తులను రాసిచ్చేశారన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఇంకా ఎన్ని కోట్లు కావాలి..? దోపిడీ ఇకనైనా ఆపండి అని అన్నారు. హైకోర్టు లాయర్లపైనే కేసులు పెడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని పవన్ ప్రశ్నించారు. తాను సీఎం అయితే అద్భుతాలు ఏమీ జరగవన్న పవన్..సీఎం పదవి అనేది మంత్రదండం కాదు.. చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండం అని నిర్వచించారు. ఎన్నికల వేళ ఆకాశం చేతిలో పెడతామని నేతలు హామీలు ఇవ్వొచ్చు కానీ ఒక్కొక్కరి కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతోందని పవన్ మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో తూర్పు కాపు రాష్ట్ర స్థాయి నాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరు కాగా, పలువురు తూర్పు కాపు నాయకులు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు. అందరికీ సమాన అవకాశాలు లభించాలి..సమర్థులైన నాయకులు తయారు కావాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నించే నాయకులు కావాలని అన్నారు. తాను ఓడిపోయింది నిజమే కానీ, అన్నింటికీ సిద్ధమై వచ్చానని పవన్ అన్నారు.
తూర్పుకాపు నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న పవన్ భీమవరం నాకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందన్న పవన్.. జనసేన ఏర్పాటు చేస్తున్న జనవాణిలో ప్రజా సమస్యలను క్షుణ్ణంగా విన్నానని, వారి క్షోభను చాలా దగ్గరి నుంచి చూశానని తెలిపారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువమంది తూర్పుకాపులే ఉన్నారు.. వలస వెళ్తున్న వారిలోనూ తూర్పు కాపులే ఎక్కువగా ఉన్నారని పవన్ అన్నారు. దేశంలో ఏ నిర్మాణం వెనకైనా ఉత్తరాంధ్ర తూర్పు కాపులున్నారు.. కానీ, తూర్పుకాపుల జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజంలోనూ తూర్పుకాపుల సంఖ్య ఎక్కువే... జనసేన వస్తే ముందుగా తూర్పు కాపుల జనాభా గణాంకాలు తీస్తాం అని తెలిపారు. సమాజానికి ఎంతో చేస్తున్న తూర్పు కాపులకు ఏమివ్వాలన్న ఆలోచన మొదలైందని చెప్పారు.
చట్టాలు అందరికీ న్యాయం చేస్తే కుల సంఘాలు లేకపోయేవి అని పవన్ అభిప్రాయపడ్డారు. అందరం కలిసికట్టుగా ఉంటే డిమాండ్ చేయగలం, సాధించగలం.. ఏ కులమైనా అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలి అని అన్నారు. తూర్పుకాపుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులూ ఉన్నారు.. నాయకులు బాగు పడుతున్నారు తప్ప కులం ఎదగట్లేదని తెలిపారు. ఉత్తరాంధ్ర కాపులకు ఆ 3 జిల్లాలు దాటితే గుర్తింపు కార్డులు ఉండవని, తెలంగాణలో తూర్పుకాపులను బీసీల నుంచి తీసేస్తే ఒక్క నాయకుడు కూడా ప్రశ్నించలేదని పవన్ మండిపడ్డారు.
ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆస్తులను రాసిచ్చేశాడన్న పవన్.. తాను ఓడిపోయింది నిజమే కానీ, అన్నింటికీ సిద్ధమయ్యే పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికే వచ్చానని అన్నారు. ఒక్కొక్కరి కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతోందని, సమస్యలను పట్టించుకోనప్పుడు ఆవేదన బయటకొస్తుందని పేర్కొన్నారు. తూర్పు కాపులకు తానున్నానని హామీ ఇచ్చారు.