Palakollu MLA Nimmala Ramanaidu arrested: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో అక్రమ మట్టి తరలిస్తున్నారని దళితులు గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దత్తుగా గత రెండు రోజులుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోరాటం చేస్తున్నారు. రాత్రులు అక్రమంగా మట్టి తరలించడాన్ని అడ్డుకోవడం కోసం చించినాడ నిద్రించారు. దళితులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న నిమ్మలను పోలీసులు అరెస్టు చేశారు.
పాలకొల్లు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ - పెరుగులంక గ్రామాల్లో దళితుల భూముల్లో వైసీపీ నాయకుల అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే రామానాయుడు సోమవారం నుంచి దళితులు, గ్రామస్థులతో కలసి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రి చించినాడ గోదావరి గట్టుపైనే నిద్రించి నిరసన తెలిపారు. ఇవాళ మరో సారి గ్రామస్థులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతుండగా... గోదావరి ఏటి గట్టు ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఎమ్మెల్యే నిమ్మలను బలవంతంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే నిమ్మల అరెస్టు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేని అరెస్టు చేసిన పోలీసులు ఎక్కడికి తరలించేది చెప్పకుండా.. పలు ప్రాంతాల్లో తిప్పారు.