మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి గార్ల కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేశారు.
గాంధీని ఆరాధిస్తూ..: గాంధీని అభిమానించి అనుసరించటమే గాదు.. ఏకంగా ఆవాహన చేసుకొని మనసా వాచా ఆచరించి చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులు.. పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో 1900 జనవరి 26న సంపన్న కుటుంబంలో జన్మించారు పసల కృష్ణమూర్తి. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో పుట్టారు అంజలక్ష్మి. 1916లో వీరికి పెళ్లయింది. 1921లో గాంధీజీ.. విజయవాడ, ఏలూరు పర్యటన వీరి జీవితాల్ని మార్చివేసింది. గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని స్వాతంత్య్ర సమరంలో దూకారు. 1929 ఏప్రిల్ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు. వెంటనే గాంధీజీ.. పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని "ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా..?" అని అడగ్గా.. ఇకపై నగలు ధరించబోమంటూ ప్రతిన బూనారు. నాటి నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కుమార్తె కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి స్వయంగా వడికిన నూలుతో చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇద్దరినీ 1931లో జైలుకు పంపించింది ఆంగ్లేయ సర్కారు. చంకలో నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు అంజలక్ష్మి.