ఒకవైపు గోదావరికి అడ్డుగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయడంతో నీటి ప్రవాహాలు వెనక్కు మళ్లుతున్నాయి. దీంతో పోలవరం దగ్గర నదిలో నీటిమట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. అప్రోచ్ ఛానల్ తవ్వకం పూర్తి లక్ష్యం మేరకు సిద్ధం కాలేదు. తొలుత 500 మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టారు. ఆ అప్రోచ్ ఛానల్‌లోనే శుక్రవారం నుంచి నీటిని వదిలే ఆస్కారం ఉంది. గోదావరి ఉపనది శబరి పరీవాహకంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్నాయి.
వరుసగా 26 సెంటీమీటర్లు, 56 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఉంటుందన్న అంచనాల మేరకు రాబోయే నాలుగైదు రోజుల్లో గోదావరికి ప్రవాహాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్రోచ్ ఛానల్ మీదుగా నీరు మళ్లించేందుకు యోచిస్తున్నారు. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులు బుధవారం పోలవరంలో వివిధ పనులను పరిశీలించారు.
కేంద్ర జలశక్తిశాఖ సమీక్ష నేడు: పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసంపై గురువారం కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పనుల తీరును జలశక్తి కార్యదర్శి దిల్లీ నుంచి వర్చువల్‌గా సమీక్షిస్తారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు, కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ అధికారులు ఉంటారు. వరద వచ్చే క్రమంలో పోలవరం పరిస్థితుల్ని సమీక్షిస్తారని తెలిసింది.
కృష్ణమ్మలో జలప్రవాహం