Frustrated passenger threw mirchi powder: హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాడు. పాస్పోర్టు సరిగా లేదంటూ విమానాశ్రయ అధికారులు అతన్ని వెనక్కి పంపారు. తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు.
పాలకొల్లు పట్టణం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రయాణికులపై కారం చల్లాడు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని.. తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు.