ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ విద్యార్థులు.. చిత్రకళా నేర్పరులు - తణుకు

పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి చిత్రకళలో ఆ విద్యార్థులు సాధించిన పతకాలే నిదర్శనం. వారంతా పేదింటి పిల్లలు అయితేనేం చదువుతోపాటు చిత్రకళలోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమకున్న సహజ ప్రతిభకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడై జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పతకాలను స్వంతం చేసుకుంటున్నారు. ప్రతిభా పాటవాలకు పేదరికం అడ్డుకాదంటూ నిరూపిస్తున్నారు.

ప్రభుత్వ విద్యార్థులు.. చిత్రకళా నేర్పరులు

By

Published : Jul 14, 2019, 10:58 PM IST

ప్రభుత్వ విద్యార్థులు.. చిత్రకళా నేర్పరులు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు చిత్రకళలో ప్రతిభ చూపిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్నారు. వీరిలో ఉన్న అభిరుచిని గుర్తించిన పాఠశాలలోని చిత్రకళా ఉపాధ్యాయులు వెంపట్రావు, శ్రీనివాస్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, రజత పతకాలతోపాటు ప్రశంసాపత్రాలు పొందారు. ఏటా వందమందికి పైగా విద్యార్థులు పోటీలకు హాజరైతే సగం మందికి పైగా విజేతలుగా నిలవటం విశేషం. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము విజయాలు సాధించగలుగుతున్నామని ఆ చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులు అంకితభావంతో... విద్యార్థుల ఆసక్తితో ఆ పాఠశాలలో పతకాల పంట పండుతోంది. ఆ బడిలో విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చిత్రకళను బోధిస్తారు. ఆ కళలో ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతోపాటు.. సామాజిక పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, పచ్చదనం-పరిశుభ్రత వంటి జాతీయస్థాయి అంశాలపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు వాటికి చిత్రరూపం ఇస్తారు. తమ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించటం తమకెంతో సంతోషంగా ఉందనీ.. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళ్లేలా వారిని తీర్చిదిద్దుతామని ఆ గురువులు అంటున్నారు.

నిత్యం చదువుకే అంకితం కాకుండా... తమలోని ప్రతిభకు పదును పెడుతూ, ఆసక్తి ఉన్న రంగంవైపు అడుగులేస్తే.. ఉన్నత శిఖరాలు అధిరోహించటం కష్టమేమీ కాదనడానికి ఆ చిన్నారులే నిదర్శనం.

ఇవీ చదవండి..నాడు కళకళ.. నేడు నిర్లక్ష్యంతో వెలవెల

ABOUT THE AUTHOR

...view details