వ్యవసాయం తర్వాత ఎక్కువమంది కూలీలు ఆధారపడిన నిర్మాణ రంగం ఇసుక కొరతతో అల్లాడిపోతుంది. ఇసుకపై నిషేధం విధించాక... ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో.. భవన నిర్మాణాలను యజమానులు నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో 11 ఇసుక ర్యాంపులు 45 రోజులుగా మూతపడ్డాయి. వాగులు, వంకల నుంచి తీసుకొచ్చే ఇసుకపై కూడా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండా పోయింది. నెలన్నర రోజులుగా ఉపాధి లేక పస్తులుంటున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక కొరత.. కూలీల ఉపాధికి గండి - ఇసుక కొరత
ఇసుక కొరతతో కూలీల ఉపాధికి గండిపడింది. తాపీ మేస్త్రీల నుంచి పెయింటర్ల వరకూ 32 విభాగాల వారు పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. చేతిలో రూపాయి కూడా లేక పేదకూలీలు విలవిల్లాడుతున్నారు. నెలసరి ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారి దుర్భరంగా బతుకులీడుస్తున్నారు.
ఒక్క భవన నిర్మాణ రంగంపైనే 32 విభాగాల కార్మికులు ఆధారపడి ఉపాధి పొందుతారు. ఇటుక, కంకర తయారీ కూలీలు, తాపీమేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, గ్రానైట్ పనివారు ఇలా లక్షల మందికి నిర్మాణ రంగం ఉపాధినిస్తోంది. పల్లెల్లో పనులు లేకుంటే.. వ్యవసాయ కూలీలు సైతం సమీపంలోని పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు కుదిరేవారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం దెబ్బతినగా.. నిర్మాణ రంగంలోనూ పని లేని పరిస్థితి నెలకొంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కొరత కారణంగా దాదాపు 15వందల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు నిలిచిపోయాయి. సిమెంటు, ఇనుము, గృహోపకరణాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అవసరమైన ఇసుక అధికారుల అనుమతితో రవాణా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొత్త ఇసుక విధానం అమలయ్యే వరకూ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.