పశ్చిమ గోదావరి జిల్లాలో.. రాష్ట్ర సరిహద్దు అయిన జీలుగుమిల్లిలో కరోనా కలకలం పెరుగుతోంది. పొరుగు రాష్ట్రంతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వస్తున్నవారిలో కొందరికి కరోనా సోకుతున్నట్టు నిర్థరణ అవుతోంది. ఈ పరిణామంతో.. రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వారంతా... సరిహద్దు గ్రామమైన అశ్వారావు పేట వరకు బస్సుల్లో వచ్చి... అక్కడ నుంచి కాలినడకన రాష్ట్రంలోకి వస్తున్నారు.
అలా... పశ్చిమ గోదావరి సరిహద్దులో వచ్చినవారికి ట్రూనాట్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కొవిడ్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. దీంతో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పోలవరం సీఐ నవీన్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు సరిహద్దులో పహారా కాస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాకే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.