కరోనా ప్రభావం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. మొదటిసారి వచ్చినప్పుడు నష్టాలకు గురైన రైతులు తిరిగి రెండోసారి ప్రారంభం కావడంతో మరింత సంక్షోభానికి కారణమవుతోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దేవాలయాలు మూత పడటంతో కొబ్బరి రైతులకు నిరాశే మిగిలింది. ఎగుమతులు తగ్గిపోవడంతో.. ధరలు తగ్గిపోయి నష్టాల పాలవుతున్నారు. మరోవైపు ఎరువుల ధరలు పెరిగిపోవడంతో రైతులకు మరింత భారంగా మారింది.
సుమారు 40 వేల ఎకరాల్లో కొబ్బరి పంట
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా పండించే వాణిజ్య పంటల్లో.. కొబ్బరి ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు 60 మొక్కలు వేస్తారు. ప్రస్తుతం కొబ్బరి చెట్లకు నల్లి పురుగు ప్రభావం ఎక్కువగా ఉండడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 2వేల నుంచి 2500 వరకు కాయల దిగుబడి వస్తున్నాయి. నల్లి పురుగు ప్రభావంతో కాయల సైజు తగ్గిపోవడంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.