'దేనికైనా ప్రారంభం గ్రాఫిక్సే'
అమరావతికి మట్టి, నీళ్లు ఇచ్చిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ మట్టి, నీళ్ల మహిమ త్వరలోనే చూపుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. భాజపా నాయకులు ఇక్కడ వార్డు సభ్యులుగా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. రాజధాని గ్రాఫిక్స్ అని విమర్శించే వాళ్ల కళ్లు తిరిగేలా నిర్మాణం చేసి చూపుతామని స్పష్టం చేశారు.
ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసి..భారత వైమానిక దళం చూపిన ధైర్య సాహసాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి ప్రజావేదికలో ఏలూరు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన..వైకాపా, భాజపా నేతల తీరును ఎండగట్టారు. రాజధాని నిర్మాణం వేగంగా సాగుతుంటే కొందరూ గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేస్తున్నారని..దేనికైనా ప్రారంభం గ్రాఫిక్సేనని స్పష్టం చేశారు.
తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పశ్చిమగోదావరి జిల్లా ఆదరించిందని..సీఎం తెలిపారు. పోలవరం 66.5 శాతం పూర్తయిందని... ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ప్రతి ఎకరానికి నీరిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లోనూ జిల్లా ముందుండాలని ఆకాక్షించారు.