CBN MEETING WITH BC LEADERS: బీసీల పొట్టగొట్టిన జగన్‌రెడ్డి.. తన పొట్ట నింపుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు ఇదేం ఖర్మ అని.. బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో.. బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేరుకు మాత్రమే బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి.. పెత్తనం అంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు.
జగన్ మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని మండిపడ్డారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప.. బీసీలకు అదనంగా జగన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 140బీసీ కులాలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 16పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా ముగ్గురికే ఇచ్చారని విమర్శించారు.