కాబోయేవాడే కాలయముడయ్యాడు.. అనుమానంతో అగ్గిపెట్టాడు.. మరొకరితో చనువుగా మాట్లాడుతోందని పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు నచ్చజెప్పడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న అర్థరాత్రి తర్వాత ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి యువతిపై చల్లి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో జరిగింది. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. రాంబాబు, ఆ యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సీఎం జగన్ ఆరా..