తెదేపాకు బలం లేకపోయినా, గెలవలేమని తెలిసినా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని వైకాపా ఎమ్మెల్యేలు విమర్శించారు. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల తీరుపై విజయనగరంలో జిల్లా శాసనసభ్యులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో పార్వతీపురం, గజపతినగరం, సాలూరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మండలిలో తెదేపా సభ్యులు ప్రవర్తించిన తీరు బాధాకరమని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణ విస్తీర్ణంలో ఆ పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విమాన శాఖ అథారిటీ నిర్ణయించిన విస్తీర్ణం మేరకే తమ ప్రభుత్వం భూములు సేకరిస్తోందని స్పష్టం చేశారు.