Paidithalli Ammavari Sirimanotsavam: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో తొలిఘట్టం తొలేళ్ల పండుగ. ఈ సంబరం అంబరాన్నంటింది. తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం రాత్రి 11గంటలకు భాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పూజారులు, తలయారులు తరలొచ్చారు. కోటలోని రౌండ్ మహల్లో ఘటాలకు శక్తి పూజలు నిర్వహించారు. ఘటాలను తిరిగి గుడివద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి చదురుగుడి వద్ద పూజారి అమ్మావారి చరిత్రను చెప్పారు. అనంతరం ఘటాల్లో నిల్వచేసి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన ధాన్యాపు విత్తనాలను రైతులకు పంచిపెట్టారు. వీటిని పొలాల్లో చల్లితే అధిక దిగుబుడులు వస్తాయని రైతుల విశ్వాసం. ఈ నేపథ్యంలో పూజారి చేతుల మీదుగా విత్తనాలను అందుకునేందుకు ప్రజలు భారీగా విరగబడ్డారు.
అనంతరం ఘటాలను భక్తుల దర్శనార్ధం బడ్డీలా ఏర్పాటు చేశారు. ఇక్కడికి భక్తులు పెద్దఎత్తున తరలొచ్చి పసుపు, కుంకుమలతో మొక్కులు తీర్చుకున్నారు. ఇలా తొలేళ్ల కార్యక్రమం ఘటాలు కోట వద్దకు తీసుకురావటం. శక్తి పూజలు నిర్వహించటం. తిరిగి అమ్మవారి కోవెలకు తరలిరావటం. అందులోని ధాన్యాన్ని రైతులకు పంచిపెట్టడం. ఘటాలకు భక్తులు పసుపు, కుంకుమ సమర్పణ కార్యక్రమాలన్నీ మంగళవారం రాత్రి మూడు గంటల వరకు సాగాయి.