చిన్నప్పటి నుంచి అతనికి తెగువ, సాహసం, సహాయం చేసే గుణాలు ఎక్కువ. తన వృత్తిలోనూ అదే అంకితభావంతో పనిచేస్తూ...వృత్తినే దైవంగా ఎన్నుకుని ముందుకు సాగిన వ్యక్తి. అతనే విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరం గ్రామానికి చెందిన బోడ సింగి గొల్లడు. తాజాగా ఆయన రాష్ట్రపతి అవార్డు-2020కి ఎంపికయ్యారు.
రాష్ట్రపతి అవార్డుకు విజయనగరం వాసి ఎంపిక సింగి గొల్లడు చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మ్యాన్గా పనిచేస్తూ...ఈ నెల ఆగస్టు 30న రిటైర్ అవుతున్న నేపథ్యంలో..ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆయనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేయటం వల్ల అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పలువురి ప్రాణాలు కాపాడాడు...
ఈయన గతంలో హెచ్పీసీఎల్ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో మూడు రోజులు ఏకధాటిగా సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తించి అప్పట్లో ప్రభుత్వం క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది . ఆ తర్వాత నెల్లిమర్ల ఏరు వద్ద జరిగిన ప్రమాదంలో బస్సులో నుంచి 20 మందిని సురక్షితంగా అత్యంత ధైర్య సాహసాలతో ఒడ్డుకు చేర్చిన ఘటనలో అప్పటి ప్రభుత్వం అవార్డుతో పాటు క్యాష్ రివార్డ్ ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం చీపురుపల్లి అగ్నిమాపక శాఖ కేంద్రంలో లీడింగ్ ఫైర్ మాన్ గా పనిచేస్తూ ఆగస్టు నెల చివర్లో రిటైర్ కానున్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని గొల్లడు చెబుతున్నారు.