ప్రకృతి సేద్యానికి నమూనాగా విజయనగరం జిల్లాను తీర్చిదిద్దుతామని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ అన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా ఇటు ప్రజల ఆరోగ్యం, అటు రైతుల ఆదాయం గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. కలెక్టర్ బంగ్లాలోని వ్యవసాయ క్షేత్రంలో నవధాన్య విధానానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. కలెక్టర్ స్వయంగా అరకపట్టి పొలందున్నారు. ధాన్యపుజాతి, పచ్చిరొట్ట జాతి, పప్పు జాతి, సుగంధ జాతి, చిరుధాన్యాల జాతి, కూరగాయలు తదితర 18 రకాల విత్తనాల మిశ్రమంతో కూడి నవధాన్య విధానంలో సాగు పద్ధతిని ప్రారంభించారు. బీజామృతంతో శుద్ది చేసిన విత్తనాలను కలెక్టర్ స్వయంగా చల్లారు.
నవధాన్య విధానంతో సాగు ప్రారంభించిన కలెక్టర్ - సాగు చేస్తున్న విజయనగరం కలెక్టర్
పెన్ను పట్టుకుని పేపర్లపై సంతకాలు పెట్టాల్సిన కలెక్టర్.. అరక పట్టి సాగు ప్రారంభించారు. ప్రజల సమస్యలు తీర్చే అధికారి.. విత్తనాలు చేతపట్టి నవధాన్య సాగు మొదలుపెట్టారు.
నవధాన్య విధానంలో వివిధ రకాల విత్తనాలను కలిపి వెద జల్లడం వల్ల పంటలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయన్నారు. అలాగే నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరిగి, అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ అనుసరించి మంచి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని కోరారు. జిల్లాలో 52 క్లస్టర్ల ద్వారా సుమారు 10వేల మంది రైతులు నవధాన్య విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: పారదర్శకంగా 'ఆప్కోస్' ద్వారా పొరుగు సేవల ఉద్యోగాల భర్తీ: సీఎం జగన్