హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్కు ఏ మత విశ్వాసం ఉన్నా.. పరమతాలను గౌరవించాలన్నారు. హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థ క్షేత్రంలోని బోధికొండపై కోదండరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఏడాదిన్నరగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం అవుతున్నాయనీ.. వీటికి పరాకాష్టగా రామతీర్థ ఘటన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలపై వరుస సంఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
భాజపా నేతల పాదయాత్ర..
రాముని విగ్రహం ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కోట నుంచి వేణుగోపాలస్వామి గుడి వరకు భాజపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. హైందవ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులు పండితులను సంప్రదించి.. విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను గుర్తించి, కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.