ఇంటింటికీ రేషన్ సరఫరా విధానం విజయనగరంజిల్లాలో చక్కగా అమలవుతోందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. దీనిని మరింత సౌకర్యకరంగా మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ శశిధర్ విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం జొన్నాడ, విజయనగరంలోని లంకాపట్నం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో ఎండీయుల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీని పరిశీలించారు.
అధికారులకు ఆదేశాలు:
మొబైల్ డిస్పెన్సరీల ద్వారా రేషన్ పంపిణీలో వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని.. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ శశిధర్ ఆదేశించారు. వాలంటీర్లకు దీని పట్ల అవగాహన పెంచాలని.. ఈ పాస్ వేసే పనిని వారికి అప్పగించాలన్నారు.
వీధి వీధికీ వాహనంలో సరకుల సరఫరా:
సరుకులు పంపిణీ చేసే రోజుకు ఒకటిరెండు రోజుల ముందుగానే ఆయా ప్రాంత ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. వాహనం వెళ్లేందుకు వీలైన ప్రతి వీధిలోకి వెళ్లి, సరకులను పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాల వద్ద జనం క్యూ లేకుండా, వాహనం దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువమంది ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికీ తప్పనిసరిగా సంచుల ద్వారా సరుకులను అందజేయాలని సూచించారు.