విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ సమీపంలోని సుంకి గ్రామం మూల మలుపు వద్ద ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీళ్లంతా పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందినవారు. గరుగుబిల్లి మండలం రావివలసలో ఇటీవల బంధువు చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆటోలో బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను 108 వాహనాలు, ఆటోల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.