ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిధులు వచ్చేదెప్పుడు.. సమస్యలు తీరేదెప్పుడు..?

Vizianagaram Hudhud Colony: హుద్‌హుద్ తుపాను వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం.. గత ప్రభుత్వం విజయనగరం జిల్లా అలమండలో గృహ సముదాయం నిర్మించింది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కొందరు కోర్టుకెళ్లడంతో.. ఐదేళ్ల జాప్యం తర్వాత అక్టోబరులో బాధితులకు గృహాలు కేటాయించారు. అయితే కనీస వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

Vizianagaram Hudhud Colony
Vizianagaram Hudhud Colony

By

Published : Mar 30, 2023, 1:49 PM IST

కనీస వసతుల్లేక హుద్‌హుద్‌ కాలనీవాసుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

Vizianagaram Hudhud Colony: వీరంతా.. హుద్​హుద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన విజయనగరం జిల్లా అలమండ వాసులు. హుద్​హుద్ తుపానులో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించాలని గత ప్రభుత్వ సంకల్పించింది. ఇందుకు జామి మండలం అలమండ వద్ద 160 గృహాల సముదాయం నిర్మించింది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత.. లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కోర్టులో ఐదేళ్ల పాటు వివాదం నడిచింది. హైకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గతేడాది అక్టోబరులో మోక్షం లభించింది. లాటరీ పద్దతిలో 135 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. మరో 25గృహాలు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గృహ సముదాయం ఐదేళ్ల పాటు వృథాగా ఉండిపోవటంతో.. అధ్వాన్నంగా మారింది. ఆకతాయిల చేష్ఠలతో ఇళ్లల్లో గచ్చులు.. తలుపులు, కిటికీలు పాడైపోయాయి. మరోవైపు రోడ్లు లేవు.. ఇళ్ల మధ్య మురుగు మడగులు దర్శనమిస్తున్నాయి. వర్షపు నీరు పారే మార్గం లేక.. గృహాల ముందు నిల్వ ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతం చిన్నపాటి చెరువుని తలపిస్తోంది. ఒక్కసారి వర్షం కురిస్తే నెలల తరబడి ఆ ప్రాంతం నివాసులు ఇళ్లలోకి వెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు.

ఇదిలా ఉండగా అలమండ హుద్​హుద్ కాలనీలో సెప్టిక్ ట్యాంకులు నిర్మించినా వాటికి పైపులు అనుసంధానం చేయకపోవటంతో అవి నిరుపయోగంగా మారాయి. మరోవైపు కాలనీ వాసుల కోసం నిర్మించిన తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీంతో లబ్ధిదారులకు తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి వీధి కొళాయిలు ఏర్పాటు చేసినా.. గృహ సముదాయంలోని పై అంతస్తుల్లోని వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కింది నుంచి బిందెలతో నీళ్లు మోసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వృద్ధుల ఇబ్బందులు చెప్పనవసరం లేదు. పలువురు ప్రమాదాలకు సైతం గురయ్యారు. కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని.. అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పలుమార్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన సైతం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హుద్​హుద్ కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కాలేదు. అధికారులను సంప్రదించిన ప్రతిసారి రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు శూన్యమంటున్నారు.

కాలనీ సమస్యల పరిష్కారంపై గృహ నిర్మాణశాఖ అధికారులు మాట్లాడుతూ.. కాలనీలో పరిస్థితుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నీళ్ల ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించాం.. మిగిలిన పనుల నిర్వహణకు 30లక్షల రూపాయల అవసరమని అంచనా వేసి ప్రతిపాదనలు సిద్దం చేశామని.. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతమాని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గత ఐదు నెలలుగా అధికారుల ఇదే చెబుతున్నారని నిధులు వచ్చేదెప్పుడు.. సమస్యలు తీరేదెప్పుడంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details