విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జ్యూట్ మిల్లును 1920లో స్థాపించారు. దశాబ్దం క్రితం వరకు ఇందులో చుట్టుపక్కల 50గ్రామాలకు చెందిన 10వేల మంది కార్మికులు ఉపాధి పొందేవారు. పరోక్షంగా మరో 10వేల కుటుంబాలకు ఈ మిల్లు ద్వారా ఉపాధి లభించేది. అప్పట్లో ఈ మిల్లులో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే మిన్నగా భావించే వారు. ప్రస్తుతం ఈ మిల్లు తరచూ లాకౌట్లతో మూతపడుతుండటంతో కార్మికుల బతుకు దుర్భరంగా మారుతోంది. 1994 లాకౌట్ నుంచి క్రమేపీ పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు 10 వేల మంది కార్మికులు పనిచేస్తే.. ప్రస్తుతం 3వేల లోపు మాత్రమే కార్మికులు పనిచేస్తున్నారు. రిటైరైన వారు వెళ్లిపోతుంటే... కొత్తగా రెగ్యులర్‌గా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు 1000లోపే ఉన్నారు. ఒప్పంద పద్ధతిలోనే ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
1994లో తొలిసారిగా 16 నెలల పాటు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. 2000 సంవత్సరంలో 10నెలలు, 2006లో 6 నెలలు లాకౌట్ ప్రకటించారు. 2008లో కార్మికులు 10నెలల పాటు సమ్మె చేశారు. గతేడాది మేలో 45 రోజుల పాటు లాకౌట్ విధించారు. గతేడాది డిసెంబర్‌లో ముడి సరుకు కొరతతో 15 రోజులు ఉత్పత్తి నిలిపేశారు. ప్రస్తుతం జ్యూట్ కొరత కారణంగా ఈ నెల 5నుంచి మిల్లు లాకౌట్ ప్రకటించారు.
నెల్లిమర్ల జ్యూట్ మిల్లు లాకౌట్‌పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జ్యూట్ పరిశ్రమలకు లేని ముడిసరుకు కొరత.. ఇక్కడే ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మిల్లులు సవ్యంగానే నడుస్తున్నాయని.. ముడిసరుకు తెప్పించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని కార్మిక నేతలు అంటున్నారు. ఆ సాకుతో లాకౌట్ ప్రకటించడం సరికాదంటున్నారు.