Nandigama Pond Beautification: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోనూ 75 చెరువులను బాగు చేయాలని సంకల్పించింది. వీటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులను కేటాయించింది. పథకం కింద విజయనగరం జిల్లా భోగాపురం మండలం నందిగామ చెరువుని అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. చెరువు నిర్మాణం, అభివృద్ధి కోసం 3 లక్షల 90 వేల రూపాయల ఉపాధి హామీ నిధులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ.. డ్వామా వెచ్చించింది. ఉపాధి హామీ వేతనదారులతో పనులు చేయించి మట్టిని తొలగించి గట్టును బలోపేతం చేశారు.
అడపాదడపా సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ చెరువుని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నందిగామ సర్పంచ్ మురళీమోహన్ రావు సంకల్పించారు. సుమారు 5లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి చెరువుకు అదనపు హంగులు అద్దారు. చెరువు అడగు భాగంలో రాతికట్ట, నడక దారి, నాలుగు వైపులా కడియం నుంచి తీసుకొచ్చిన 20 రకాల పూలు, అలంకరణ మొక్కలను నాటించారు. గ్రామంలో పది కాలాల పాటు గుర్తుండిపోవాలనే సంకల్పంతో సుందరీకరణ పనులు చేసినట్లు మురళీమోహన్ రావు తెలిపారు. చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఆహ్లాదంగా తీర్చిదిద్దటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ మురళీమోహన్ రావు ప్రత్యేక శ్రద్ధతో.. తమ గ్రామానికి ఒక వినోద కేంద్రంగా సరస్సు మారిందంటున్నారు.