ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి. మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న సమాచారంతో విశాఖ జిల్లా పెదబయలు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. బాంబు డిస్పోజల్ టీంతో ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు రోజులుగా పెదబయలు ఎస్ఐ పి. మనోజ్ కుమార్, ఆర్ఎస్ఐ మహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మావోయిస్టు యాక్షన్ టీంలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులపై వాహన రాకపోకలను పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు ఎస్సై విజ్ఞప్తి చేశారు.