విజయనగరం జిల్లాలో చివరి విడతలో 10మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం డివిజన్లోని గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాలతో పాటు... సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండంలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, వేపాడ, జామి, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో ఉన్న 296 గ్రామ పంచాయతీలకు... 57 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీమమయ్యాయి. 2,418 వార్డుల్లో 845 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. కాగా... మిగిలిన 238 సర్పంచ్ స్థానాలు, 1,573 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 4,042 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మూడోవిడతలో నిలిచిన స్థానానికి సైతం...
ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పోలింగ్ కోసం 2,793 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ దఫా ఎన్నికల్లో మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, కూనేరు, కొండలింగాలవలస, శృంగవరపుకోట మండలంలోని ధారపర్తి గ్రామాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ ను నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి పంచాయతీ నాలుగో వార్డు ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.