విజయనగరం జిల్లా(Vizianagaram district) ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ వైద్య పరంగా ఇప్పటికీ పక్కనున్న జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కార్మికుల వైద్యమైనా ఇదే దైన్యం. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ.. కేంద్ర ప్రభుత్వం విజయనగరంలో ఈఎస్ఐ(ESI) ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019 డిసెంబర్ 19న విజయనగరంలో రూ.75కోట్లతో మంజూరైన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొత్స సత్యనారాయణ సహా పలువురు రాష్ట్ర మంత్రులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండేళ్లలో పనులు పూర్తిచేసి.. ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. రెండేళ్లు కావస్తున్నా కనీసం పునాదిరాయి పడలేదు.
పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన
విజయనగరం మండలం గాజులరేగ పంచాయతీ ఏయూ ప్రాంగణ సమీపంలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. వాస్తవానికి పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. నాటి ప్రజాప్రతినిధులు స్థలాన్నిచూసి ఆమోదించారు. తీరా ఆ స్థలంపై న్యాయస్థానంలో కేసు ఉన్నందున మరో చోట కడదామనుకున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన కారణాలతో ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితమైంది. 2019లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కదలిక వచ్చిందనుకుంటే పనుల్లో మాత్రం ముందడుగు పడలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి