ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు.. ప్రజలకు ఇబ్బందులు

Effects of Delay Road Construction: నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు.. ఆ పట్టణ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ఏడాదిగా కొలిక్కిరాక.. వాహనదారులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి.. దోమల బెడద రెట్టింపయ్యిందని ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో రహదారి పనుల జాప్యం.. ప్రజలకు శాపంగా మారింది.

highway works slow in gajapatinagaram
విస్తరణ పనుల జాప్యం

By

Published : Jun 11, 2023, 1:23 PM IST

రహదారి విస్తరణ పనుల జాప్యం

Effects of Delay Road Construction: రాష్ట్రంలో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో జాతీయ రహదారి-26.. 14వందల 48 కిలోమీటర్లు పొడవున విస్తరించింది. వాహనాల రద్దీ కారణంగా గతంలో 43వ జాతీయ రహదారిగా ఉన్న ఈ మార్గాన్ని.. 26గా మార్పు చేసి విస్తరణ పనులను కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా 2 లైన్ల రోడ్డును 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తోంది. ఏపీలో విజయనగరం జిల్లా నాతవలస నుంచి మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టక్కి వరకు వ్యాపించిన ఈ రోడ్డు విస్తరణ పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించారు.

మొదట్లో కరోనా విజృంభణతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత రహదారి విస్తరణ ఊపందుకుంది. విజయనగరం, రామభద్రపురం మార్గాల్లో పనులు పూర్తి చేశారు. గజపతినగరంలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గజపతినగరంలో 2 కిలోమీటర్ల మేర వ్యాపించిన రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఒక క్రమపద్ధతిలో కాకుండా అక్కడక్కడా పనులు ప్రారంభించడంతో.. ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అవస్థలు పడుతున్నామని ఆటో డ్రైవర్‌లు వాపోతున్నారు. జాతీయ రహదారి పక్కన కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవటంతో మురుగు సమస్య ఏర్పడుతోంది. గజపతినగరంలోని ప్రధాన వీధుల మీదుగా వచ్చే మురుగు నీరు బహిరంగ ప్రాంతానికి ప్రవహించే మార్గం లేకపోవటంతో ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. దీంతో.. పరిసర ప్రాంతాలన్నీ దుర్గందభరితంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలం వస్తున్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని గజపతినగరం ప్రజలు కోరుతున్నారు.

"గజపతినగరం రహదారి విస్తరణ పనులు వారం రోజులపాటు చేస్తే మరో వారం రోజులపాటు ఆపేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై దుమ్ము ధూళి చేరిపోతోంది. దీనివల్ల మేము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. చాలా మంది వ్యాపారులు నష్టపోయారు. ఇలా అయితే ఇక్కడ ప్రజలు ఉండే పరిస్థితి లేదు. రోడ్లు ఎందుకు తవ్వేస్తున్నారో తెలియట్లేదు.. ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావట్లేదు.. అసలు దీనికి ఒక ప్లానింగ్ అయినా ఉందో.. లేదో తెలియట్లేదు. మిగతా రోడ్ల విస్తరణ పనులు చాలా స్పీడ్​గా అయ్యాయి. మరి గజపతినగరంలో మాత్రం ఎందుకు ఇలా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయో తెలియట్లేదు. కారణం ఏదైనా గానీ.. ఈ రహదారి విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టి.. వేగంగా పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము." - మజ్జి రామకృష్ణ, గజపతినగరం

"గత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ సవ్యంగా పూర్తి చేయట్లేదు. ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. దీనివల్ల వ్యాపారస్థులమంతా తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికైనా.. త్వరగా ఈ రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము." - వెంకటరమణ, వ్యాపారి

ABOUT THE AUTHOR

...view details