ఏ ఎన్నికల్లో అయినా బ్యాలెట్ పత్రాలే కీలకం. వాటిని చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా ముద్రించాలి. ఆపై పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాలి. ఈ ప్రక్రియ అధికారులకు కత్తి మీద సాములాంటిదే. విజయనగరం జిల్లాలో పల్లె పోరుకు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసే పని మొదలైంది.
స్ట్రాంగ్ రూం నుంచి బయటకు..
జిల్లాలో 959 పంచాయతీల్లో 14.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరందరూ సజావుగా ఓటేయాలంటే భారీ కసరత్తు అవసరం. నవంబరులోనే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు వచ్చాయి. వాటిని మార్చిలోనే ముద్రించి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మరోసారి వీటిని పరిశీలించడానికి శుక్రవారం జడ్పీ నుంచి పంచాయతీ వనరుల కేంద్రానికి తరలించారు. వరుస సంఖ్య, ముద్రణ, తదితర అంశాలను పరిశీలించనున్నారు.
గరిష్ఠంగా 12 గుర్తులు..
రెండు రకాల బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. ఒకటి సర్పంచి, రెండోది వార్డు సభ్యుడు. ఓటర్లు వేర్వేరుగా ఓట్లు వేయాలి. సర్పంచులకు ముదురు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు కాగితాలను కేటాయించారు.