ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం... ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణకు యత్నం - vizayanagaram district latest news

విజయనగరంలోని ఎంఆర్ కళాశాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగరానికి విద్యల నగరంగా కీర్తి తెచ్చింది ఈ కళాశాల. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన దీనిని ప్రైవేట్ పరం చేసేందుకు మాన్సాస్ ట్రస్టు ప్రస్తుత పాలకవర్గం సంకల్పించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

mr college
mr college

By

Published : Oct 2, 2020, 6:49 PM IST

విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్నారు మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులతో పాటు జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో అటు విద్యార్థులు, సిబ్బంది కష్టమేనని ఆందోళన చెందుతున్నారు.

విజయనగరంలోని మహారాజ కళాశాలను.. విజయనగరం రాజు 1857 సంవత్సరంలో స్థాపించారు. 1879లో డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేశారు. మద్రాస్ కళాశాల తర్వాత రాష్ట్రంలో డిగ్రీ విద్యను అందించిన కళాశాల ఇదే కావటం విశేషం. విజయనగరం రాజు విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా 100 ఏళ్ల కిందటే ఏర్పాటైన విద్యా సంస్థ ఇది. కొన్నాళ్లు మాన్సాస్ ఆధ్వర్యంలో నడిచిన తరువాత అటానమస్ కళాశాలగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఐదువేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ప్రస్తుతం మహారాజా కళాశాల అటానమస్ పేరుతో నడుస్తోంది. కళాశాలలో 50 మంది అధ్యాపకులు... మరో 100 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనిని ప్రైవేట్ కళాశాలగా మార్చేందుకు మాన్సాస్ ట్రస్టు ప్రయత్నిస్తుండటంతో అధ్యాపకులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎంఆర్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే.. జీతాలకు గడ్డుకాలమే కాకుండా ఉద్యోగ భద్రత కోల్పోతామన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. అంతేకాకుండా విద్యార్థులపై ఫీజుల భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మాన్సాస్ పాలకవర్గం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details