ఐటీ గ్రిడ్ వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలి: దాడి
ఐటీ గ్రిడ్ ద్వారా ప్రజల సమాచారాన్ని ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించాలని వైసీపీ నేత దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయటం దేశద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించటంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఐటీ గ్రిడ్ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ చోరీ చేసిందని వైకాపా నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన...ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటం, వినియోగించటం దేశద్రోహానికి పాల్పడటమేని అభివర్ణించారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై లోతైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మూడింట రెండు వంతుల స్థానాలను వైకాపా కైవసం చేసుకుంటుందని దాడి వీరభద్రరావు జోస్యం చెప్పారు.