భర్త ఒడిలోనే భార్య తుది శ్వాస విడిచింది. ఈ హృదయ విదారకర ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
భర్త ఒడిలోనే తుదిశ్వాస
అప్పుడే హాజరు వేయించుకుని వీధులు ఊడ్చడానికి చీపురు పట్టుకుని రోడ్డుపైకి వెళ్లిన విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పారిశుద్ధ్య కార్మికురాలు హఠాన్మరణం చెందింది. ఈ ఘటన గాజువాక 75వ వార్డు పెదకోరాడ ఉక్కు నిర్వాసితకాలనీలో చోటు చేసుకుంది.
మల్కాపురానికి చెందిన ధనాల దాలయ్య గాజువాకలో పారిశుద్ధ్య మేస్త్రిగా పని చేస్తున్నారు. అతని భార్య అప్పలనర్సమ్మ(53) 75వ వార్డులో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిగా 17 ఏళ్లుగా పని చేస్తోంది. దాలయ్య భార్యను మస్తర్ కార్యాలయం వద్ద దింపి మోటారు సైకిల్‌పై విధులకు వెళ్లారు. మస్తర్ వేసుకున్న ఆమె చీపురు పట్టుకుని తోపుడు రిక్షా వద్దకు వెళ్తుండగా ఆయాసం రావడంతో దాలయ్యకు ఫోన్ చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్తాను అక్కడే ఉండమని చెప్పి దాలయ్య 5 నిముషాల్లోనే వచ్చేశారు. ఆయాసంతో రొప్పుతున్న భార్యను దాలయ్య ఒళ్లోకి తీసుకుని నీరు పట్టారు. ఇంతలో ఒక్కసారిగా ఎగఊపిరి రావడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలేసింది. భార్య తన చేతుల్లోనే చనిపోవడంతో దాలయ్య గుండెలవిసేలా విలపించారు. అప్పలనర్సమ్మ ఫిబ్రవరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది.
ఇదీ చదవండి:నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు