ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కుర్రాడు... స్పెయిన్​ పోటీలకు ఎంపికయ్యాడు

కాళ్లకు చక్రాల బూట్లు ధరించాడంటే బుల్లెట్టు లాగా దూసుకెళతాడు ఆ బుడతడు. స్కేటింగ్ చేస్తూ కొండలెక్కేస్తాడు.. పల్లపు ప్రాంతాల్లో సర్రున జారగలడు. స్కేటింగ్ పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సాధించిన అతను... ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.

పతకాల పవనం

By

Published : Jun 6, 2019, 3:44 PM IST

స్కేటింగ్​లో సత్తా చాటుతున్న విశాఖ కుర్రాడు

విశాఖకు చెందిన వెంకట పవన్ కార్తికేయ స్కేటింగ్​లో ప్రత్యేక ప్రతిభ చాటుతున్నాడు. ఇన్ లైన్ ఆల్పైన్ ఈవెంట్​కు మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకేఒక్కడిగా గుర్తింపు పొందాడు. స్పెయిన్​లోని బార్సిలోనాలో వచ్చే నెల 4 నుంచి 14 వరకు జరగనున్న ఇన్ లైన్ ఆల్పైన్ ఈవెంట్​కు మన దేశం నుంచి నలుగురు ఎంపికవ్వగా.. అందులో పవన్​ది ప్రథమ స్థానం. గతేడాది డిసెంబరులో వైజాగ్​లో జరిగిన ఆర్ఎస్ఎస్ఐ జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో డౌన్ హిల్ ఈవెంట్ పోటీల్లో వెంకట పవన్ కార్తికేయ సిల్వర్ పతకాన్ని సాధించాడు. జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి సత్తా చాటిన కార్తికేయ... ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు కఠోర సాధన చేస్తున్నాడు. రెండు వరుసల్లో అమర్చిన పోల్స్ మధ్య నుంచి వేగం తగ్గకుండా..వాటిని తాకకుండా ముందుకు దూసుకురావడమే ఇన్ లైన్ ఆల్పైన్ ఈవెంట్.

టెన్నిస్ నుంచి స్కేటింగ్​కు

తొలుత టెన్నిస్ తో ఆటల్లోకి వచ్చిన పవన్ కార్తికేయ.. ఆ తరువాత స్కేటింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. ఏడేళ్ల నుంచి ఈ రంగంలో సత్తా చాటుతున్నాడు. విశాఖలోని కైలాసగిరి, సింహాచలం కొండలపై ప్రతి రోజు పవన్ కార్తికేయ కఠోర సాధన చేస్తున్నాడు. బార్సిలోనాలో జరిగే పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details