విశాఖ జిల్లా పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయగోపురం, ముఖమండపంలో రాతి పలకలను తొలగించినట్లు ఆలయ నిర్వహకులు గుర్తించారు. రాతి పలకలు కొన్నింటిని తొలగించి, మళ్లీ అమర్చేశారు. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు కొండపైన దీపారాధ అర్చన పూర్తిచేసిన తర్వాత అర్చక స్వాములు తాళాలు వేసి దిగువకు వచ్చేశారు. ఈ ఉదయం ఆలయం తలుపులు తెరిచేందుకు వచ్చిన అర్చకులు రాతి పలకలు తొలగించినట్టుగా గుర్తించారు.
ఆలయ ముఖమండపంలో రాతి పలకలను తవ్వేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ విషయాన్ని దేవాలయ ఈవో ఈఎల్ఎన్ శాస్త్రికి ఆర్చకులు తెలియజేశారు. ఈవో పద్మనాభం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఈ దుశ్చర్య ఆకతాయిల చర్యా లేదా గుప్త నిధుల కోసం జరిగిన అన్వేషణా అనేది దర్యాప్తులో తేలాల్సిఉంది.