Andhra Cricket Association Issue: వైకాపా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే సాయిరెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్..ఏసీఏని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన 4 నెలలకు జరిగిన ఏసీఏ ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎపెక్స్ కౌన్సిల్ పదవులన్నీ సాయిరెడ్డి బంధుగణం, ఆయన అనుయాయులపరం కాబోతున్నాయి.
సాయిరెడ్డి అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డికి అధ్యక్ష పదవి, అల్లుడు రోహిత్‌రెడ్డికి ఉపాధ్యక్ష పదవి, సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త గోపీనాథ్‌రెడ్డికి కార్యదర్శి పదవి ఖాయమయ్యాయి. మిగతా పదవులు మరికొందరు అనుయాయులకు.. ఇలా ఏసీఏ ఎన్నికల ప్రక్రియ ముగియకముందే పదవుల పందేరం జరిగిపోయింది. ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. ఎన్నిక లాంఛనమే. కోశాధికారిగా ఎంపిక కానున్న ఆడిటర్ ఎ.వి.చలం.. గోపీనాథ్‌రెడ్డికి సన్నిహితుడు. కౌన్సెలర్‌గా పోటీ చేస్తున్న పురుషోత్తం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి సన్నిహితుడు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వెంకట శివారెడ్డి వైకాపా నాయకుడే. ప్రస్తుత శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయన మేనమామ.
గతంలో ఏసీఏలో సీఈవో పోస్టు లేదు. 2019లో కొత్త పాలక మండలి ఏర్పడ్డాక.. ఆ పోస్టును సృష్టించి శివారెడ్డిని నియమించారు. వీరిలో ఒకరికి విశాఖకు చెందిన స్వామీజీ ఆశీస్సులున్నట్లు తెలిసింది. ఎన్నికల అధికారిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రమాకాంత్‌రెడ్డిని నియమించడం విశేషం..
క్రికెట్ సంఘాలపై రాజకీయ పెత్తనం చాలాచోట్ల ఉన్నదే కానీ.. మరీ ఇలా సొంత కంపెనీలోలా పదవులన్నీ పంచేసుకోవడం ఎక్కడా ఉండదేమో.. విశాఖను ముఖ్యమంత్రి జగన్ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిందే తడవు.. సాయిరెడ్డి విజయవాడ నుంచి ఏసీఏ కార్యాలయాన్ని విశాఖకు హడావుడిగా తరలించేశారు. మంగళగిరి సమీపంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని గత మూడేళ్లుగా ఏసీఏ ఉద్దేశపూర్వకంగానే పూర్తి చేయలేదన్న ఆరోపణలున్నాయి.