'Underwater Tunnel Expo' start in Visakhapatnam: అదొక అద్భుత ప్రపంచం. అక్కడ అడుగు పెట్టామంటే ఊహల్లో తేలిపోతాం. అందులో సంచరిస్తున్నంత సేపూ సముద్ర గర్భంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఎటుచూసిన అందమైన చేపల పరుగులు.. మైమరపించే దృశ్యాలు.. మాటల్లో వర్ణించలేని అనుభూతులు.. అదే ‘అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్ పో’ ఎగ్జిబిషన్. ఇప్పుటివరకూ విదేశాల్లో చూసిన అండర్ వాటర్ టన్నెల్ ఫిష్ ఎక్స్పోను విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విశాఖట్టణంలో ఏర్పాటు చేశారు. టన్నెల్‌లోని అందమైన చేపల సముదాయం సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
ప్రతీ ఏటా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునే హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ తాజాగా విశాఖలో ప్రారంభమైంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్పో పర్యాటకులను, సందర్శకులను మరింతగా అలరిస్తోంది. బీచ్ రోడ్డులోని సబ్ మెరైన్ ఎదురుగా ఉన్న పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించి.. టన్నెల్‌లోని వివిధ జాతుల విదేశీ, స్వదేశీ చేపల సముదాయాన్ని ఆసక్తిగా తిలకించారు.
అనంతరం మూడు నెలల పాటు ఈ ప్రదర్శన సందర్శకులను అలరించనుందని తెలిపారు. దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో నిర్వహించే అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ఇక్కడి సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. 250 అడుగుల పొడవైన టన్నెల్‌లో 2వేల రకాల అందమైన చేపల సముదాయం, సముద్ర అడుగు భాగంలో ఉండే వింత జీవులు అలా కళ్ల ముందు, మనపై నుండి కదలాడుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.. ఫిష్ అక్వేరియంలలో రంగు రంగుల చేపలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అండర్ వాటర్‌లో ఉన్నామా లేక మరిదైన లోకంలో ఉన్నామా అన్నట్టుగా సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది.