నర్సీపట్నం కొన్నేళ్లగా ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. పట్టణంలో ప్రస్తుతం 65 వేలకు పైగా జనాభా ఉంది. డివిజన్ కేంద్రం కారణంగా నిత్యం వేల మంది వచ్చి వెళుతుంటారు. పర్యాటక ప్రాంతం లంబసింగి వెళ్లేందుకు జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో వాహనాలు నర్సీపట్నం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. నర్సీపట్నం చుట్టుపక్కల ఆరుమండలాలతో పాటు ఏజెన్సీలోని చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల ప్రజలు నర్సీపట్నం మార్కెట్‌పైనే ఆధారపడతారు. పట్టణంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో ఉండగా, బస్సులు, లారీలు, వ్యాన్లు వందల సంఖ్యలో ఉన్నాయి.
పురపాలికగా మార్పు జరిగిన ఈ తొమ్మిదేళ్లలో పట్టణం నలుచెరలా విస్తరించింది. ఇందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేదు. పట్టణానికి ప్రధాన రహదారి ఒక్కటే ఉంది. రాకపోకలన్నీ ఈ రోడ్డుమీదనే సాగాలి. పార్కింగ్ స్థలాలు లేవు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపేస్తుంటారు. పాదచారుల కోసం దారులు లేవు. కీలకమైన శ్రీకన్య కూడలి, అబీద్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు అమర్చాలని ప్రతిపాదించారు. పెదబొడ్డేపల్లి కూడలి నుంచి శ్రీకన్య కూడలి, అబీద్‌కూడలి, ఐదురోడ్ల కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారిపై రద్దీని నియంత్రించేందుకు నిత్యం నాలుగు బ్లూకోట్స్ బృందాల గస్తీని ఏర్పాటు చేశారు.
చోడవరం దాటాలంటే కష్టమే..
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ ఎవరికీ పట్టడంలేదు. పట్టణంలో 150 వరకు కార్లు, ఆరు వేలకు పైగా ద్విచక్ర వాహనాలు, వెయ్యి వరకు ఆటోలు నిత్యం పరుగులు తీస్తుంటాయి. లారీలు, ట్రాక్టరులు, బస్సులు సరేసరి. వీటితోపాటు గోవాడ చక్కెర కర్మాగారం గానుగాట ప్రారంభం కావడంతో చెరకు లోడ్‌తో నిత్యం వందలాది ఎడ్లబళ్లు వస్తుంటాయి. ఇక పట్టణంలో అంతర్గత రహదారులన్నీ 10 నుంచి 12 అడుగుల లోపు వెడల్పుతో ఉన్నాయి. ఇటువంటి ఇరుకు దారుల్లో ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకొనేందుకు కూడా వీలుండదు. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వన్‌వే ఏర్పాటు చేస్తే మంచిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బి-ఎన్ రహదారిలో గోవాడ వంతెనపై రాకపోకలు నిలిచిపోతున్నాయి.
* ట్రాఫిక్ ఇబ్బందులపై ఎస్సై విభీషణరావు మాట్లాడుతూ గోవాడ గానుగాట కాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతాయని గుర్తించామన్నారు. అదనంగా హోమ్‌గార్డులను ఇవ్వాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.
ఇలా చేస్తే మేలు...