ఆ మన్యం కశ్మీర్, ఊటీ అందాలను తలపిస్తుంది. ఆ తీరం అంతర్జాతీయ బీచ్‌లకు దీటుగా ఉంటుంది. ఓ వైపు నీలి సముద్రం... మరోవైపు పచ్చని హరిత హారం. మైదాన ప్రాంతంలో సింహాచలం... మన్యం కొండలపై మోదకొండమ్మ. ఓ వైపు యుద్ధ విమానం.. మరోవైపు జలాంతర్గామి. విశాఖ జిల్లా పర్యాటక స్వర్గధామం. నర్సీపట్నం నుంచి వెళితే చింతపల్లి... ఆ మార్గంలో మంచు తెరలు అసలు ఊటీలో తిరుగుతున్నామా? అనిపించాల్సిందే. పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే లంబసింగి ఇక్కడిదే. జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఇది. అందుకే నవంబరు నుంచి జనవరి వరకు ఇక్కడికి సందర్శకులు ఎంతో ఆత్రుతగా వస్తారు. ఎన్నో అంచనాలతో వచ్చిన వారంతా అంతకుమించిన ఆశ్చర్యాన్ని, అనుభూతిని పదిలంగా తీసుకువెళ్తారు.
ఎన్నో వింతలు..
ఇక వడ్డాది మాడుగులలో హల్వా రుచి చూసి అలా మన్యం కొండలు ఎక్కితే పాడేరును సందర్శించవచ్చు. గిరి కొండల్లో నివసించే ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారు దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ చుట్టు పక్కల ప్రాంతాలను సందర్శించే ప్రజలు ముఖ్యంగా మోదకొండమ్మ తల్లిని దర్శించుకునే వెళ్తారు. విశాఖ మీదుగా కాశీపట్నం చేరుకుని అలా పచ్చని కొండల అందాల్ని చూస్తూ ఊటీ తరహా వంపుల రహదారులపై పయనిస్తూ వెళితే ఆంధ్రా కశ్మీరం పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో వింతలు అడుగడుగునా తారస పడతాయి. గాలికొండ, సుంకరమెట్ట వ్యూ పాయింట్స్ సందర్శకులకు అందాలు ఎంతగా రంజింపజేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అరకు కాఫీ సువాసనలు అద్భుతం
తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తు నమోదు చేసిన పర్వతాలు విశాఖ జిల్లాలోనే ఉన్నాయంటే ఇక్కడి ప్రకృతి రమణీయత ఎంత గొప్పగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు తూర్పు గోదావరి జిల్లా మన్యం... మరోవైపు ఒడిశా అడవులు... ఇంకోవైపు ఛత్తీస్‌గఢ్ అరణ్యం మధ్య ఉండే విశాఖ మన్యం అందానికే కాదు.. అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి. దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడిస్తున్న కాఫీ తోటలు.. అదే మన అరకు కాఫీ సువాసనలు ఓ విలువైన పర్యాటక ఆకర్షణ. మంచుదుప్పటిలా కమ్మేసే చలిగాలిలో ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ అరకు కాఫీ తాగుతుంటే ఆ క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
వలిసే పూల సోయగాలు
ఆ జ్ఞాపకం ఎంత పదిలంగా నిలుస్తుందనే విషయం విశాఖ అందాలు వీక్షించిన ప్రతి ఒక్క పర్యటకుడికీ తెలుస్తుంది. అంతేనా ప్రత్యేకించి ఈ సీజన్లో ఎక్కడెక్కడి వారినో ఆకట్టుకునే మరో మన్యం ఆకర్షణ వలిసె పూల సోయగాలు. చలికాలం వస్తే విశాఖ మన్యం అందాలకు హద్దే ఉండదని చెప్పడానికి నిదర్శనం ఈ వలిసె పూలే. పసుపు రంగులో ఉండే వలిసెలు అలా గాలికి కదులుతూ ఉంటే మనసు వాటితో పాటే తేలుతూ వెళ్లిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగానే సందర్శకుల్ని అబ్బురపరిచే అరకు అందాలను ఎన్నో రెట్లు గొప్పగా చూపించే వలిసె పూలు చలికాలంలోనే వికసిస్తాయి. చలికాలం దాటితే వలిసెల అందాలను చూసి మురిసిపోదామనుకునే వారికి ఆ అనుభవం దక్కదు. అందుకే ఈ పర్యాటక సీజన్‌కు వలిసెలు మరో ప్రధాన ఆకర్షణ.
రెండు కళ్లు సరిపోవు..
విశాఖ అరకు రైలు ప్రయాణం, లోయ ప్రాంతాలు, నిమిషానికి ఓసారి పలకరించే చీకటి గుహలు, అక్కడక్కడ దర్శనమిచ్చే జల పాతాలు, సెలయేళ్ల చప్పుళ్లు ఇలా అరకు లోయకు వెళ్లే మార్గం విశాఖ మన్యం పర్యాటకానికి వెన్నెముక. ఇక భౌగోళిక అద్భుతం బుర్ర గుహల గురించి వేరుగా చెప్పాలా? ప్రకృతి ప్రసాదించిన వరంగా సహజసిద్ధంగా ఏర్పడ్డ శిలాజాల అద్భుత దృశ్యాల్ని వీక్షించేందుకు రెండుకళ్లు సరిపోవనే చెప్పాలి. డుడుమ, కటిక, చాపరాయి వంటి అనేక జలపాతాలు ఉన్నాయి. ఇలా విశాఖ మన్యం పంచే ఆహ్లాదం గురించి ఎంత చెప్పినా తక్కువే.
రుషికొండ బీచ్ అదుర్స్
మన్యం ఇలా పర్యాటక రారాజుగా విశాఖ జిల్లాకు వన్నె తెస్తే... మైదాన ప్రాంతంలోనూ ఎన్నో ఆకర్షణలు సందర్శకుల మనసుల్ని దోచుకుంటాయి. అందులో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేనిది సాగర తీరం. ఆర్కే బీచ్, యారాడ బీచ్, భీమిలి బీచ్.. ఈ సీజన్లో పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. విశాఖ తీరం వెంబడి ఉండే బీచ్‌లలో ఈ ఏడాది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బీచ్ సైతం ఉంది. బ్లూ ఫ్లాగ్ స్థాయిని దక్కించుకున్న రుషికొండ బీచ్ అది. ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్‌గా రుషికొండ నిలిచింది.