ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘దసపల్లా’పై అత్యుత్సాహం!.. 22(ఎ) నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు - Andhra Pradesh Main News

Dasapalla lands: నిషిద్ధ జాబితాలో నుంచి మా భూములను తీసేయండి అంటూ ఎన్నిసార్లు పేదలు మొరపెట్టుకున్నా అధికారులు కనికరించరు. విశాఖలో ఓ విశ్రాంత ఏఎస్సై అయితే 30 సార్లు స్పందనలో అర్జీ పెట్టుకున్నా న్యాయం జరగలేదు. అలాగే మురళీనగర్‌లో ఒక బిల్డరు 20 ఫ్లాట్లు నిర్మించి కొందరికి అమ్మేశారు. దానిలో పిసరంత... ప్రభుత్వ భూమి ఉందని... మొత్తం అపార్ట్‌మెంటునే 22(ఏ)లో పెట్టేశారు. ఆ ప్రభుత్వ భూమి ఎంతో తెలుసా.. కేవలం 0.0114 చదరపు మీటర్లు. ఏళ్ల తరబడి ఇలాంటి వారి వినతులను పట్టించుకోని ప్రభుత్వం... దసపల్లా భూములపై మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. 22(ఏ)నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది.

Dasapalla lands
దసపల్లా భుములను 22(ఏ) నుంచి తొలగించేందుకు వ్యూహాత్మక అడుగులు

By

Published : Jan 11, 2023, 7:38 AM IST

Updated : Jan 11, 2023, 12:32 PM IST

Dasapalla lands Issue: విశ్రాంత ఏఎస్సై కాజ చిన్నారావు వయసు 75 సంవత్సరాలు. 2012లో మధురవాడ సర్వే నంబరు 329లో 200 గజాల్లో స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు. 2016లో ప్రభుత్వం ఆ సర్వే నంబరులోని భూముల్ని ప్రభుత్వం నిషిద్ధ జాబితాలోకి చేర్చింది. చిన్నారావు కుటుంబ అవసరాల కోసం ఆ ఇంటిని అమ్ముకుందామన్నా వీలు కావట్లేదు. దానిని 22 (ఏ) నుంచి తీసేయాలని ఇప్పటికి 30 సార్లు స్పందనలో అర్జీ పెట్టుకున్నా న్యాయం జరగలేదు. విసిగి వేసారిన ఆయన... గత ఏడాది అక్టోబరు 31న కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ జిల్లా కలెక్టరుకు ‘స్పందన’లో అర్జీ పెట్టుకున్నారు. ‘నవంబరు 14న కలెక్టరును కలిసి పిటిషన్లపై ఏం చేశారని అడిగితే.. ఏం చెప్పారో తెలుసా... బాధితుడి మాట్లల్లోనే విందాం.

ధనవంతులకు కట్టబెట్టేందుకు ఆఘమేఘాల మీద ఉత్సాహం: వృద్ధాప్యంలో తనకు ఆధారమైన ఇంటిని, స్థలాన్ని అన్యాయంగా నిషిద్ధ జాబితాలో పెట్టేస్తే... ఏడు పదులు దాటిన ఒక వ్యక్తి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం లేకుండా చస్తే చావనీ అని జిల్లా కలెక్టరు కటువుగా మాట్లాడారే....! మరి అదే విశాఖలో గత ప్రభుత్వాలు ఎప్పట్నుంచో 22(ఏ) జాబితాలో ఉంచి కాపాడుకుంటూ వస్తున్న సుమారు 2వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూముల్ని 64 మంది ధనవంతులకు ఆగమేఘాల మీద కట్టబెట్టేందుకు ప్రభుత్వం, అధికారులు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారు?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ప్రచారం జరుగుతున్న వ్యక్తులకు చెందిన ఎష్యూర్‌ రియల్టర్స్‌ అనే సంస్థ... దసపల్లా భూముల యజమానులుగా చలామణి అవుతున్న 64 మందితో 71:29 నిష్పత్తిలో డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకోవడమే దానికి కారణమా? ఆ ఒప్పందాన్ని రిజిస్టరు చేయడానికి అవసరమైన డబ్బు.. సాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ నుంచే వెళ్లిందని.. అంతిమంగా ఆ భూములు చేరేది వారికేనని ఊరూవాడా కోడై కూస్తున్నాయి.

ప్రభుత్వం ఇంకా ఆ భూముల్ని 22(ఏ) నుంచి తొలగించక ముందే... ఎష్యూర్‌ రియల్టర్స్‌ సంస్థ అక్కడ నిర్మించబోయే భవనాల్లో ఫ్లాట్ల విక్రయ ధరను చదరపు అడుగుకు 8వేల నుంచి 9వేల రూపాయల చొప్పున నిర్ణయించి, లోపాయికారీగా బుకింగులూ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

హైకోర్టులో రాణికమలాదేవికి అనుకూలంగా తీర్పు: విశాఖ నడిబొడ్డున 4 సర్వే నంబర్ల పరిధిలోని 60 ఎకరాలపై 1958లో ప్రభుత్వం తనకు గ్రౌండ్‌రెంట్‌ పట్టా ఇచ్చిందని రాణీ కమలాదేవి చెబుతున్నారు. ఆ భూమిలో ప్రస్తుతం 15 ఎకరాలే మిగిలింది. దానిని ఆమె పలువురికి విక్రయించేశారు. ప్రస్తుతం ఆ భూమిలో తమకు వాటా ఉన్నట్లు కమలాదేవితో పాటు 64 మంది చెబుతున్నారు. ఆమెకు గ్రౌండ్‌రెంట్‌ పట్టా ఇవ్వడం చెల్లదని 1998లో సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. దానిపై ఆమె హైకోర్టుకు వెళ్లగా అనుకూల తీర్పు వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా అప్పీలు చేయకపోవడంతో.. సుప్రీంకోర్టూ హైకోర్టు తీర్పును సమర్థించింది. కోర్టు తీర్పులు అలా ఉన్నా.. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని భావించిన అధికార యంత్రాంగం.. 15 ఎకరాల్ని 22(ఏ) జాబితాలో ఉంచి కాపాడుతోంది. ఆ భూముల్ని 22(ఏ) నుంచి తొలగించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ రాణీ కమలాదేవి 2016లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అప్పట్నుంచి అది పెండింగులో ఉంది. వైకాపా ప్రతిపక్షంలో ఉండగా ఆ పార్టీ నేత, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. అప్పటి ప్రభుత్వం ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులపరం చేయనుందని హడావుడి చేశారు. ఆ భూముల విలువ 15 వందల కోట్లని, సీబీఐ విచారణ జరపాలని డిమాండు చేశారు.

న్యాయ పోరాటం ఎందుకు చేయడం లేదు?వైసీపీ అధికారంలోకి వచ్చాక... ప్రభుత్వ పెద్దల కన్ను ఆ భూములపై పడింది. గతంలో కోర్టులిచ్చిన తీర్పులను కారణంగా చూపించి... వాటిని కాపాడేందుకు న్యాయ పోరాటం చేయకుండా, ఆ భూముల్ని కొట్టేసేందుకు పన్నాగం రచించారు. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చకచకా పావులు కదిపారు. అందులో భాగంగానే దసపల్లా భూముల్ని 22(ఏ) నుంచి తొలగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలని కోరుతూ.. 2021 ఆగస్టులో విశాఖ జిల్లా కలెక్టరుతో ప్రభుత్వానికి లేఖ రాయించారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత రాకముందే... ఎంపీ సాయిరెడ్డికి సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఉమేష్, దుస్తుల దుకాణం యజమాని గోపీనాథ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఏర్పాటైన ఎష్యూర్‌ డెవలపర్స్‌ సంస్థ 2021 జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో దసపల్లా భూముల యజమానులుగా చలామణి అవుతున్న 64 మందితో విచిత్రమైన డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకుంది. భూమి యజమానులుగా చెబుతున్నవారికి కేవలం 29శాతం, డెవలపర్లకు 71శాతం వాటా చొప్పున ఒప్పందం జరిగింది.

‘దసపల్లా’పై అత్యుత్సాహం!.. 22(ఎ) నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details