విశాఖ ఉక్కు.. దేశంలోనే ఓ పెద్ద బ్రాండ్. ఈ పరిశ్రమ గొప్పగా ఎదగటంలో, దేశమంతా ఉక్కు ప్రతాపం చూపటంలో.. వాల్తేరు రైల్వే డివిజన్ పాత్ర అత్యంత కీలకమైనది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సరకు సుమారు 70శాతం కేవలం రైల్వే ద్వారానే రవాణా అవుతోంది. ఈ అనుబంధం ప్లాంట్ ప్రారంభం నుంచే కొనసాగుతూ వస్తోంది.
వందల కిలోమీటర్ల దూరం..
500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిలా, 690కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని జరోలి గనుల నుంచి ఐరన్‌ఓర్‌ను వాల్తేరు గూడ్స్‌రైళ్లు.. ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌కు తరలిస్తున్నాయి. 70శాతం రవాణా బైలడిలా నుంచే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఉక్కు పరిశ్రమకు అవసరమైన బొగ్గును 410కిలోమీటర్ల దూరంలోని తాల్‌చేర్ గనుల నుంచి తెస్తున్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో తయారైన ఉక్కు చువ్వలు, రీబార్స్, వైర్‌రాడ్స్, ఇతర ఇనుప ఉత్పత్తులు, స్టీల్ ఉత్పత్తులు, ముద్ద ఇనుము, వ్యర్థ లోహాలు.. ఇలా వేర్వేరు రకాలుగా సరకును వాల్తేరు డివిజన్‌కు చెందిన గూడ్స్‌రైళ్లు దేశవ్యాప్తంగా తరలిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు ముడిసరకు రావాలన్నా, ఇక్కడ నుంచి తయారైన ఇనుము, స్టీల్ ఉత్పత్తుల్ని తీసుకెళ్లాలన్నా రైల్వేనే ముందుంది. రోజుకు కనీసం 9 నుంచి 12 గూడ్స్‌రైళ్ల మేర సరకు రవాణా అయ్యేది. 2019-20లో రోజుకు సగటున 12, 2020-21లో సగటున రోజుకు 10 గూడ్స్ రైళ్లను వాల్తేరు డివిజన్ సమకూర్చింది. కొవిడ్ విజృంభిస్తున్న రోజుల్లోనే రవాణా ఊపందుకుందని చెప్పటానికి ఈ గణాంకాలు ఓ తార్కాణం.
ఏటా కనీసం 30లక్షల టన్నులపైగా ఉత్పత్తుల్ని, ముడిసరకును చేరవేసేందుకు వాల్తేరు డివిజన్ బాధ్యత తీసుకుంది. స్టీల్‌ప్లాంటు ప్రభుత్వరంగ సంస్థ కావటంతో రైల్వేమంత్రిత్వశాఖ సరకు రవాణా ఛార్జీల్లో మినహాయింపులు ఇచ్చినట్లు రైల్వే అధికారులు స్పష్టతనిస్తున్నారు.
ఇదీ చదవండీ..సీఎస్‌తో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి భేటీ