విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలం హంసబందకు చెందిన మహిళా రైతు జమున... 'చోడి' పంట సాగులో కొత్త విధానాన్ని రూపొందించారు. తొలుత సాధారణ గులిరాగి పద్ధతిలోనే జమున సాగు చేసేవారు. విత్తనాల వృథా, దిగుబడి తగ్గడం, పెట్టుబడి వ్యయం పెరగడం లాంటి కారణాల వల్ల... ఆదాయం వచ్చేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వ్యవసాయంపై సలహాలిస్తున్న... సంజీవిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అమ్మాజీని కలిసి సలహాలు తీసుకున్నారు. 'చోడి' పంట సాగులో కొత్త విధానాన్ని రూపొందించారు. అధిక విత్తనాల వృథాకు అడ్డుకట్ట వేసి... తక్కువ విత్తనాలు, తక్కువ పెట్టుబడితోనే అంతకుమించి ఆదాయం సంపాదించేలా కొత్త పద్ధతిని రూపొందించారు. ఈ విధానంలో నాలుగైదు రెట్లు దిగుబడులు వస్తున్న కారణంగా.. ఈ పద్ధతిపై గిరిజనులు ఆసక్తి చూపిస్తున్నారు.
సాగు విధివిధానాలు...
ఘన, ద్రవ జీవామృతాలను ఉపయోగించి విత్తనాలను నేరుగా గోతుల్లో వేసి సాగుచేయటం ప్రారంభించారు. 15 రోజుల తర్వాత కొరుడు తిప్పారు. అంటే కర్రని మొక్కలపై నుంచి తాడు సాయంతో పైకి లాగడం వల్ల... వేర్లు, కాండం కలిసే చోట మొక్కలు వంగి, వాటిలో విభజన జరిగి అధిక పిలకలు వచ్చాయి. సేంద్రియ ఎరువు నేరుగా పైరుకు అందించడంతో నాలుగింతల ఆదాయం లభించింది. సాధారణ పద్ధతిలో ఒక బస్తా దిగుబడి వస్తే... ఈ విధానంలో ఐదారు బస్తాల వరకూ వస్తోందని జమున భర్త సురేశ్ తెలిపారు.