ఓ మంచి కాఫీ... తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ... కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి.
నర్సీపట్నం కాఫీ క్యూరింగ్ సెంటర్ ప్రస్థానం...
మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్ సెంటర్ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడింది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) , ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు ... ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది . తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న... నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయకంగా ఉండేది. దీని ద్వారా కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
మహిళా ఉపాధి...
ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు... దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలి రోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40 రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం... దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.