విశాఖలోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జ్యోతి మిశ్రా, డాక్టర్ దిబ్యాజీవన్ పతి.. పుర ప్రాంతాల్లో పక్షుల మనుగడపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా తూర్పుతీర ప్రాంతమైన విశాఖలో పరిశోధించి కీలక విషయాలు తెలిపారు.
సముద్రతీరం కావడంతో తరచూ కొన్ని దేశీయజాతుల పక్షులు ఇక్కడ సంచరిస్తుంటాయి. నగరంలో నిత్యం రద్దీగా ఉండి జనసాంద్రత ఎక్కువగా ఉండే దాబాగార్డెన్, జగదాంబకూడలి, ద్వారకానగర్ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య సముదాయాల్ని పరిశోధించాము. ఇక్కడ తిరిగే పక్షుల్లో ఎక్కువగా గోరింక, పావురాలు, కాకులు లాంటివి కనిపించాయి. నీడకోసం, ఆహారం కోసం ఇవి చాలా అవస్థలు పడుతున్నట్లుగా గమనించాము. భవనాల్లో ఉండేందుకు, ఆహారం దొరికేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో.. ఎత్తయిన భవనాల్లో శాశ్వతంగా ఉండే చోటును పక్షులు వెతుక్కుంటున్నాయి. ఆహారాన్ని సేకరించుకొని తిరిగి ఈ ఆవాసాలను చేరి సేద తీరుతున్నాయి. సన్‌షేడ్, దిమ్మెలు, ఏసీ యూనిట్లు తదితరాలున్నచోట గూళ్లు కట్టుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడి పావురాలు ఎతైన భవనాల మీదకెళ్లి అక్కడ తెరచి ఉన్న కిటికీల్ని, ఏసీ యూనిట్లని ఆశ్రయిస్తున్నాయి. జనాలరద్దీకి దూరంగా ప్రశాంతంగా ఉండేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని గమనించాము. -పరిశోధకులు