Special Restrictions For New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 31 సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలవుతాయని ప్రకటించారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ద్విచక్రవాహలకు సైలన్సర్లు తొలగించి నడపటం, బాణసంచా కాల్చటం వంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. గుంపులుగా రోడ్లపై చేరి కేకులు కోసి అల్లర్లు చేయొద్దని.. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దొరికితే, నిర్వాహకుల పైన కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో, అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలన్నారు. నగరంలో ఆరు బయట వేడుకలకు అనుమతులు లేవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అయిదుగురు లేదా అంతకు మించి జనం గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.