విశాఖ కలెక్టరేట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖలో విజ్ఞులు ఎక్కువ మంది ఉన్నారని, అధికారులు కూడా చక్కటి ప్రతిభావంతులు ఉన్నారని నిమ్మగడ్డ అన్నారు. విశాఖలో పోలింగ్ శాతం తక్కువ ఉందని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఓటర్లు మరింతగా ఓటింగ్ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనవచ్చని అన్నారు.
ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదు: నిమ్మగడ్డ
విశాఖ జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ఏర్పాట్లు చాలా బాగా చేసిందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అధికారులను ప్రశంసించారు. జిల్లాలో ప్రజలకు ఎన్నికల పట్ల మంచి అవగాహన కల్పించారన్నారు.
ఏకగ్రీవాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోందో అదే చేస్తున్నట్టు ఎస్ఈసీ చెప్పారు. పార్టీలను కానీ, వ్యక్తులను కానీ కించ పరిచే తీరు ఎప్పుడు ఎన్నికల సంఘానికి లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పూర్తిగా ఏకగ్రీవానికి ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదని అన్నారు. విశాఖ లాంటి జిల్లాలో 10 లేదా 15 శాతమో ఏకగ్రీవాలు అయితే పర్వాలేదని.... కానీ ఆ శాతం 40 నుంచి 45 శాతం ఉంటే అది జిల్లా ఎన్నికల యంత్రాంగం విఫలం అనుకోవాలని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం