ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి డెల్టాకు సీలేరు నీరు...! - సీలేరు జలసిరి...డెల్టాకు ఊపిరి

గోదావరి డెల్టాలోని రబీ పంటలకు  సీలేరు నుంచి అవసరమైన  నీరు ఇవ్వడానికి  ఏపీ జెన్‌కో అధికారులు నీటి నిల్వలను జలాశయాల్లో  సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు చెప్పారు.

ready-to-water-release-to-godavari-delt
గోదావరి డెల్టాకు సీలేరు నీరు

By

Published : Dec 18, 2019, 8:39 PM IST

గోదావరి డెల్టాకు సీలేరు నీరు

ప్రతీ ఏటా డిసెంబరు నెలలో గోదావరి డెల్టాలోని రబీ పంటలకు సీలేరు జలాశయం నుంచి నీటిని అందించేవారు. ఇందులో భాగంగా గత ఏడాది సుమారు 45 టీఎంసీలు నీటిని ఇచ్చారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడిన కారణంగా... జలాశయాలకు నీటి నిల్వలు భారీ ఎత్తున చేరాయి. ఆంధ్రా - ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుని గేట్లు ఎత్తాల్సి వచ్చింది. డొంకరాయితో పాటు సీలేరు జలాశయాల్లోనూ నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలకు సుమారు 100 టీఎంసీల నీరు వీటిలో చేరింది.

ప్రస్తుతం బలిమెల, జోలాపుట్‌ జలాశయాల్లో 52 టీఎంసీలు నీరు ఉండగా... సీలేరు, డొంకరాయి జలాశయాల్లో మరో 15 టీఎంసీలు నీరుంది. ప్రతీ ఏటా మాదిరిగా ఈ ఏటా విద్యుదుత్పత్తి అనంతరం ... గోదావరి రబీలో నారుమడులు వరకు సుమారు 40 టీఎంసీలు వరకూ నీటిని విడుదల చేయవచ్చు. మరో 27 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి నిరాటంకంగా అందించవచ్చని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతీ ఏటా నవంబరు నెలలో గోదావరి రబీకు నీటి విడుదల క్యాలెండర్‌ను విడుదల చేసేవారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాలువల్లో నీటి నిల్వలు ఉన్న కారణంగా ఇప్పటికీ క్యాలెండర్‌ విడుదల చేయలేదు.

నాట్లు వేసే సమయంలో సుమారు జనవరి నెల నుంచి రబీకి సీలేరు నీరు అవసరమయ్యే అవకాశముందని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విద్యుదుత్పత్తి అనంతరం విడుదలవుతున్న మూడు వేలు క్యూసెక్కుల నీటితో పాటు ధవళేశ్వరంలో ఉన్న మరో తొమ్మిది వేల క్యూసెక్కులు నీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు విద్యుదుత్పత్తికి అవసరమయ్యే నీటిని మాత్రమే వాడుకుంటున్నారు. ధవళేశ్వరం జలవనరులశాఖ నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా... నీరు విడుదల చేయడానికి సిధ్దంగా బలిమెల, డొంకరాయి జలాశయాల్లో నీటిని నిల్వ చేస్తున్నారు.

ఇవీ చదవండి...

కాలువల్లో సమృద్ధిగా నీరు... ఎండుతున్న పంట పొలాలు

ABOUT THE AUTHOR

...view details