పూసపాటి ఆనంద గజపతిరాజుకు తామే నిజమైన వారసులమని ఆయన భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళా గజపతిరాజు పేర్కొన్నారు. అధికారిక పత్రాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత ఒక్క ఆధారాన్నైనా చూపించాలన్నారు. వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. గతేడాది మేలో చెన్నైలో ఓ ఆస్తి విషయమై సంతకాలు ఫోర్జరీ చేశామంటూ సంచయిత విశాఖలోని మూడోపట్టణ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టడంతో తమకు నోటీసులొచ్చాయని.. లండన్ నుంచి ఇక్కడికి వచ్చామని ఊర్మిళ చెప్పారు.
1991లోనే ఆనందగజపతిరాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని.. ఆస్తుల పంపకాలూ పూర్తయ్యాయని, అందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆరోజు తన తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు తమకే చెందుతాయన్నారు. సంచయితకు దఖలు పడిన ఆస్తులను ఆమెకు వివాహం కాకముందు విక్రయించకూడదని పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందని, ఆమె ఆ విషయాన్ని విస్మరించి చాలా ఆస్తుల్ని అమ్మడం చట్ట విరుద్ధమని హైకోర్టు న్యాయవాది హరికృష్ణ చెప్పారు. చెన్నైలో జరిగిన సంఘటనను విశాఖలోని అల్లిపురంలో జరిగినట్టు చెప్పి మూడోపట్టణ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారన్నారు. ఈ ఆరోపణలపై సింహాచల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఛైర్‌పర్సన్ సంచయితగజపతిరాజును వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.