వైద్య వృత్తిలో ఉన్న మీరు దయచేసి ప్రాణాల మీద డబ్బులు సంపాందించకండి... నలుగురు ప్రాణాలు కాపాడండంటూ ఓ వివాహిత సెల్ఫీ వీడియోలో విజ్ఞప్తి చేసింది. తన భర్తకు కరోనా పాజిటివ్ వస్తే... రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తామని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రతినిధులు ఫోన్ చేసినట్లు ఆమె తెలిపింది. తీరా తన భర్తను ఆ ఆసుపత్రిలో చేరిస్తే... రెమ్డెసివిర్ కాకుండా మరో ఇంజెక్షన్ ఇస్తున్నారనీ... వైద్యం సైతం చేయలేదన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం జమ చేసిన నగదు ఇమ్మన్నా... దిక్కున్న చోట చెప్పుకోమన్నారని సెల్ఫీ వీడియోలో వాపోయింది.
విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 13వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. తమ వైద్యుల సలహా మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇదే సమయంలో విశాఖలో అనిల్ నీరుకొండ ఆసుపత్రి సిబ్బంది.. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయంటూ ఆరు ఇంజక్షన్ లు కలిపి 2.50 లక్షలు అని ఫోన్ చేసి బేరం కుదుర్చుకున్నారు. బాధితుడి భార్య వద్ద అంత డబ్బులు లేకపోయినా.. భర్త ప్రాణాలు కోసం అప్పు చేసి డబ్బులు జమ చేసింది. అంతే.. అక్కడ నుంచి ఆసుపత్రి సిబ్బంది.. మధు భర్తకు నరకం చూపించారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ స్థానంలో మరో రకం ఇంజక్షన్లు ఇవ్వడం, కనీసం నర్సులు కూడా చెకప్ వెళ్లకపోవడంతో.. బాధితుడు శ్వాస సమస్య తలెత్తింది.