ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో అరకొర వసతులు.. గర్భిణుల అవస్థలు

ఓ వైపు వేవిళ్లు.! మరోవైపు నిండిన నెలలు.! కూర్చోడానికి సరిపడా కుర్చీలుండవు.! తాగడానికి మంచి నీళ్లుండవు! తమ వంతు వచ్చే దాకా వరుసలో నిల్చొవాలి. నీరసం వస్తే ఉన్నచోటే కూర్చోవాలి. వందల మంది గర్భిణులు వస్తుంటే.. అక్కడ ఉండేది ఒకే ఒక్క గైనకాలజిస్ట్‌.! ఇక కాబోయే అమ్మల ఆర్తనాదాలు ఆలకించేదెవరు.? పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో.. వైద్యపరీక్షలకు వెళ్లే గర్భిణులు డెలివరీకి ముందే ప్రసవ వేదన పడుతున్నారు.

pregnents problems at paderu
పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో అరకొర వసతులు.. గర్భిణీల అవస్థలు

By

Published : Mar 25, 2021, 11:13 AM IST

విశాఖ జిల్లా పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో అరకొర సేవలు గర్భిణుల సహనానికి పరీక్షగా మారాయి. ఈ ఆస్పత్రికి ఎనిమిది మండలాల నుంచి గర్భిణులు వస్తుంటారు. స్కానింగ్ ఇతర వైద్య పరీక్షల కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. నెలలు నిండినవారు కూడా.. గంటల తరబడి వరుసలో నిల్చొవాల్సిందే. కొందరైతే నీరసించి అక్కడే కూర్పాట్లు పడుతుంటారు. కళ్లు తిరిగి స్వల్ప అస్వస్థతకు గురైన సందర్భాలూ లేకపోలేదు. మరుగుదొడ్లు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలూ సరిగాలేక అవస్థలు పడుతున్నారు.

ఒక్కరే గైనకాలజిస్ట్​....

గర్భిణుల రద్దీ బుధవారం మరీ అధికంగా ఉంటుంది. ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని గ్రామాల నుంచి గర్భిణులను ఇక్కడికి తీసుకొస్తుంటారు. అలా దాదాపు 200 నుంచి 300 మంది దాకా వస్తుంటారు. ఒక్కోసమయంలో ఆస్పత్రి ప్రాంగణం కాలు కదపలేనంత కిక్కిరిసిపోతుంది. ఎంతమంది వచ్చినా వారందరినీ పరీక్షించేది ఒక్కరే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకేఒక గైనకాలజిస్ట్.! రోజులో 50 నుంచి 60 మందికి మించి స్కానింగ్‌ చేయలేక చేతులెత్తేస్తున్నారు.

కొందరిని తర్వాత వారం రావాలని తిప్పిపంపుతున్నారు. సిబ్బంది లేక ఉన్నవారిపై పనిభారం పడుతోందని ఆశాకార్యకర్తలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు మాతా శిశు ఆస్పత్రిలో పరిస్థితుల్ని సమీక్షించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి గర్బిణుల అవస్థలపై గైనకాలజిస్ట్‌ను ప్రశ్నించారు. సిబ్బంది, సదుపాయాల కొరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆమె చెప్పారు.

పాడేరులోని ప్రైవేటు ఒకేషనల్‌ కళాశాలకు చెందిన శిక్షణ విద్యార్థులు గర్బిణులవైద్యపరీక్షలకు సహకరిస్తున్నారు. శాశ్వత సిబ్బందిని వీలైనంత త్వరగా నియమించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:పాడేరు ఏజెన్సీలో వృద్ధుడికి కరోనా

ABOUT THE AUTHOR

...view details